Header Ads

‘మక్కా’ పేలుడు కేసు కొట్టివేత

‘మక్కా’ పేలుడు కేసు కొట్టివేత

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. నిందితులు నేరం చేసినట్టుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని, ఏ ఒక్క అభియోగానికీ ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న స్వామి అసీమానంద వాంగ్మూలానికి చట్టబద్ధత లేదని, చాలా మంది సాక్షులు తొలుత ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మళ్లీ సాక్ష్యం చెప్పారని స్పష్టం చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసు కుని కేసును కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ.. నాలుగో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి రవీందర్‌రెడ్డి తీర్పునిచ్చారు.
పదకొండేళ్ల తర్వాత.. 
హైదరాబాద్‌లోని చరిత్రాత్మక మక్కా మసీదులో 2007 మే 18న బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత 1:25 గంటల సమయంలో సెల్‌ఫోన్‌ సహాయంతో బాంబును పేల్చారు. ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. 58 మంది గాయపడ్డారు. దీనిపై తొలుత స్థానిక పోలీసులు, అనంతరం సీబీఐ, ఎన్‌ఐఏలు దర్యాప్తు చేసి.. చార్జిషీట్లు దాఖలు చేశాయి. మొత్తంగా పది మందిని నిందితులుగా చేర్చాయి. సుదీర్ఘంగా 11 ఏళ్లపాటు దర్యాప్తు, విచారణలు కొనసాగాయి. తాజాగా సోమవారం తీర్పు వెలువడింది. 
అభియోగాలకు ఆధారాలేవీ? 
ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారు బాంబు పేలుళ్లకు పాల్పడినట్టు నిరూపించడంలో ఎన్‌ఐఏ విఫలమైందని న్యాయ మూర్తి రవీందర్‌రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. నిందితులపై ఎన్‌ఐఏ మోపిన ఏ ఒక్క అభియోగానికి కూడా ఆధారాలు చూపలేకపోయిందని తెలిపారు. పేలుడుకు వాడిన సిమ్‌ కార్డులను నిందితులు ఉపయోగించారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అజ్మీర్‌ దర్గా పేలుడుకు, మక్కా మసీదు పేలుడుకు అవే సిమ్‌ కార్డులను ఉపయోగించారని ఎన్‌ఐఏ అభియోగం మోపిందని.. కానీ దీనిపై ఆధారాలను చూపలేకపోయిందని స్పష్టం చేశారు. బాబూలాల్‌ యాదవ్‌ పేరుతో దేవేందర్‌ గుప్తా సిమ్‌ కార్డులను కొనుగోలు చేశారనేందుకూ ఆధారాల్లేవన్నారు. 

No comments

Powered by Blogger.